Friday, December 9, 2011

ఆ రాత్రి

దేహచ్చాయల మీద ఆరేసుకున్న
వెన్నెల క్రీనీడలు.
నఖక్షతాల్తో
చంద్రుడు,నక్షత్రాలు.

విస్తరించిన నిమిషానందపు
బోన్సాయ్ వృక్ష సమూహం.
పరిమళ నిశ్వాసం పరుచుకున్న
పట్టెమంచం.

మేని సానువుల్లో
అధరాలు తచ్చాడిన
తడి జ్ఞాపకాలు.

ఎనిమిది కాళ్ళతో
చలించిన అక్టోపసి.
సుషుప్తి గవాక్షాల్లో రెక్కలిప్పుకుని,
సుదూరమైన స్వప్న విహంగం.

ఆర్తి అంతఃస్రావమైన అలక్ నందా.

ఆ రాత్రి
చీకటి గూట్లోకి
నత్తల్లా ఒదిగిపోయాం
మేమిద్దరం.

Sunday, October 16, 2011

అచ్చం అలాగే



కొత్త చీరొకటి
ఒంటిపై చుట్టుకోడానికి
గదిలోకి దూరింది.,


గొంగళి పురుగుకి సిగ్గెక్కువ
మా ఆవిడకు లాగే.!

Monday, September 26, 2011

వాంఛ




పక్కింటి స్నానాల గదిలోకి
తొంగి చూస్తూ-
మా చెట్టు కొమ్మ!

నా తీరని వాంఛకు
బహుశా అది
ప్రతిరూపమేమో?

Thursday, September 8, 2011

కుటీరం




తూర్పు,పడమర గోడలకు-
రెండు కిటికీలతో,
మాకొక
పన్నెండడుగుల గది మాత్రమే వుంది.

ఐతే ఏం?

ఆ కిటికీ దాటి,
ఈ కిటికీలో కనిపించడానికి,
సూర్యుడికి-
పన్నెండు గంటలు పడ్తుంది.

Friday, September 2, 2011

'హైడ్ అండ్ సీక్'


నలుగురమూ
ఒక్కో చోటు వెతుక్కుని,
రహస్యంగా దాక్కున్నాం.
మిగిలిన ఒక్కడూ-
ఎక్కడున్నామో మమ్మల్ని
కనిపెట్టాలి.
** ** ** **
నలుగురమూ
ఆ ఒక్కడ్నీ మోసుకెళ్ళి,
ఓ చోట దాచి పెట్టేసాం.
ఎక్కడున్నా, ఇక ఎప్పటికీ
వాడు కనిపించడు.

Wednesday, August 31, 2011

ప్రేమతో...




ఎప్పుడు నువ్వు నెలవంకవై కనిపిస్తావో
అప్పుడే కదా నా 'రొజా' ముగిసేది.
ఇప్పుడు నువ్వు పలకరించావు కదా?
మళ్ళీ నా 'ఉపవాసం' మొదలైంది!

('రొజా' అంటే ఉపవాసం)

Saturday, August 27, 2011

జీవితకాలం


              
              


  చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా
  మనం
  కోర్టులు, ముక్కోటి దేవుళ్ల చుట్టూ-
  తిరుగుతుంటాం.


  మనలాంటి పాపాత్ముల్ని కన్నందుకు,
  పాపం భూమి
  సూర్యుడి చుట్టూ ఎప్పటికీ-
  తిరుగుతూ..తిరుగుతూ..తిరుగుతూ

       ___________ పి.రామకృష్ణ.

Tuesday, August 9, 2011

‎"న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్"

బాల్యాన్ని బంతిలా చేసుకుని
కాలం వైపుకు బలంగా విసిరాను.

తిరిగి అంతే వేగంగా-
వృద్దాప్యం నా చేతికి అందింది.

Monday, August 8, 2011

'సుప్రభాతాలు'


       
          
  కాకులన్నీ వాలాక,
  నల్ల కలువల్ని పూసిన-
  తటాకమౌతుంది చెట్టు.


  ఆకాశాన్ని కాళ్ళ క్రిందికి
  తెచ్చుకుంటుంది గబ్బిలాయి.
  చుక్కల్ని ముగ్గులోకి
  దింపుతుంది ఓ ఆకతాయి.


  పెదాల పలకల మీద
  ఓంకారాన్ని దిద్దుకుంటూ
  ఓ 'పిల్ల'నగ్రోవి.

  గుడి కోనేట్లో నిలువీత-
  నేర్చుకుంటాయి  తామర పూలు.
  చెరువు నీట్లో ముఖాలు చూసుకుని,
  మురిసిపోతుంటాయి మేఘాలు కొన్ని.

  పాల కోసం, 
  తల్లి చుట్టూ
  పొద్దుతిరుగుడు పువ్వై పోతుంది
  లేగ దూడ.

  అమ్మచేతి తేనీరు కోసం
  నా పెదాలు తేనెటీగలవుతాయి.

  అప్పుడేమో అట్లాస్-
  భుజం మీది భూమిని మెల్లగా క్రిందికి దించి,
  పుస్తకాల సంచితో-
  బడికి భయల్దేరుతాడు.

   
                       ________________
                               

Monday, July 18, 2011

'సిక్స్త్ చాంబర్'




    



'సిక్స్త్ చాంబర్'
___________________


మా ఇంట్లోనూ
ఓ పద్మనాభుడి ఆలయం వుంది!

పంచేంద్రియాలతో పోగుచేసుకున్న
పాత జ్ఞాపకాల్ని-
కాలం ఇంకా లెక్క కడ్తూనే వుంది.

స్కూలు ఫీజు, పాల బిల్లు, ఇంటి అద్దె-
ఆంక్షల గోపురంపై నిలబడి,
ఓ కోడిపుంజు కూస్తూనే వుంటుంది.

తరతరాల దాస్య చేధనలో
లెక్క తేలనంత తారతమ్యం
తారాడుతూనే వుంది.

నా ఒంట్లోనూ
నేలమాళిగ వుంది
ఆశల్ని రాసులుగా పేర్చుకుని,
శతాబ్దాలుగా నిరీక్షిస్తోంది.

మూరెడు మల్లెపూలతో మురిపించే
దేహ సౌందర్యం మెరుస్తూనే వుంటుంది.
తలపుల తటాకాల్లో తెల్ల వెంట్రుక-
వెండి తీగలా అల్లుకు పోతోంది.

చూస్తుండగానే చుట్టూ పోగై పోతున్న
వాంఛల హర్మ్యాల క్రింద వర్తమానం-
ఒంటరి ఎత్తులు వేస్తూనే వుంది.

త్రవ్వుతూ వెళ్లేకొద్దీ-
దొరికే గతం నిండా,
బాల్యం బంగారుకొండల్లే నిలబడే వుంటుంది.

అరలకొద్దీ పేరుకు పోయిన
అనుభవాల దొంతరల్లో-
ఎప్పటికో గానీ ఓ నవ్వు
నీలి వజ్రమై వెలిగి పోతుంది.

దొరకని దానికోసం ఇప్పటికీ
జీవితం వెతుకుతూనే వుంటుంది.
ఇనుప గొలుసులతో లాగే బంగారు రధం-
ఎప్పటికీ వెనుకే వుంటుంది.

నా ఒంట్లోనూ
ఓ పద్మనాభుడి ఆలయం వుంది.

ఇంకా తెరుచుకోని ఆరో గదిలో-
మృత్యువు కాచుకు కూర్చుని వుంది.


                                    

Monday, July 4, 2011

‎'కొన్ని సందర్భాలు'


ఓ నెలబాలుడి హఠాన్మరణం-
ఇంకా నా గుండె గదిలో
దోగాడ్డం నేర్చుకుంటూనే వున్నాడు.

ఓ మిత్రుడు పోతూ..పోతూ
తన చేతి స్పర్శని
జ్ఞాపకంగా మిగిల్చి పోయాడు.

ఓ ప్రత్యూషం, నీడ ని
లాక్కెళ్ళి పోతుంది.
అప్పుడు అమ్మ లాగే-
చెట్టూ విధవ.

ఓ వృద్దుని ఆలింగనంలో
నా ముందు తరాల
ప్రేమ పరిమళం.

వెళ్తూ వెళ్తూ ఎక్కడో
బాల్యాన్ని పోగొట్టుకున్నాను.
ఎప్పటికో వెతికాక,
వణికే చేతికి ఓ
ఊతకర్ర దొరికింది.

Friday, June 24, 2011

సమాంతర రేఖలు



కూలిపోతున్న స్వప్నాల అంచులకి-
ఏ కళ్ళూ వేళ్ళాడవు.
శిధిలమవుతూన్న స్వగతాల్లో-
ఏ పావురాళ్ళూ గూళ్ళు కట్టుకోవు.

చీకట్లో పెదాల రంగు నలుపు.,
స్పర్శ ఓ గాఢమైన భావన.

నలిగిన పూల కోసం
ఏ చూపులూ తచ్చాడవు.
మార్మిక క్షణాలను లెక్కించే-చేతివేళ్ళలో నిర్లిప్తత.

మేఘం మృతసంగీతాన్ని మోసుకొస్తుంది.,
కాలం తలొంచుకు పనిచేసే బానిసలా వుంటుంది.

వేల వేల నీడలుగా-చెదిరిపోయే దీపాన్ని,
ఏ పాదాలూ అనుసరించవు.

కుంచె గీసే కల అస్పష్ట చిత్రం.
ముక్కలైన భావాన్ని-
ఏ గొంతూ దాచుకోదు.

చిట్లిన పెదాలు పాటనే స్రవిస్తాయి.,
భాద ఒక శ్రోత.

ముసిరే చీకటి తెరలని-
ఏ పొద్దూ అడ్డుకోదు.
చుట్టూ పెరిగే గోడల్ని-
ఎవరూ సమాధిగా ఒప్పుకోరు.

జీవితం ఆద్యాంతాలూ లేని-
గాన స్రవంతి.
శృతి చెదిరిన సంగీతం వెనుక-
ఏ గుండె గతి మరువదు

Thursday, June 23, 2011

భేతాళ వింశతి

పక్షి వెళ్తూ వెళ్తూ -
ఓ పాటని వదిలేసి వెళ్తుంది.
...అలా నిల్చుని వుంటాం,
చెట్టొకటి వంగి, మెత్తటి ఆకులతో-
పలుకరిస్తుంది.
వున్నట్టుండి ఓకానొక గడ్డిపువ్వు
పరిమళిస్తుంది.

మర్చిపోయిన పాట గుర్తుకొచ్చి,
గుండెగూట్లో పరవశిస్తుంది.
మట్టిలో పూడ్చిపెట్టిన వ్యక్తిజ్ఞాపకం-
తులసిచెట్టై చిగురిస్తుంది.

తపస్సిద్దించి ఓ గొంగళి-
రంగు రంగు రెక్కలతో ఎగిరిపోతుంది.
మరణిస్తూ ఓ శిశువు-
మళ్ళీ నవ్వడం మొదలెడ్తుంది.

పాడెను మోసుకెళ్లే పాదాలు-
కాలాన్ని దిక్కరిస్తాయి,
శవం లేచి అందరితో చిందులేస్తుంది.

అక్షరాల కోసం ఎండిపోతుంటాం కదా?
ఓ భావం మేఘమై ముంచెత్తుతుంది

ఇంతలో తెల్లారుతుంది.
రెప్పలు విప్పామో లేదో..
కల కాలుకోద్దీ పారిపోతుంది.

అలా నిల్చుని వుంటాం.,
ఓ పక్షి వెళ్తూ వెళ్తూ..
తన లేత రెక్కను పైకెత్తి,
ముఖానింత రెట్టను విదిలిస్తుంది.
ఎప్పట్లాగే ఆకురాలిన చెట్టునీడకు-
మన జీవితాలు వ్రేళ్ళాడుతుంటాయి.

ఆమె - నేను



కట్టుకున్న బట్టల్ని
ఒక్కోటి విప్పేస్తూ..
నిజాయితీగా నిలబడిందామె.,

నిజాన్ని
అంత నిర్భయంగా చూడలేక
కళ్ళు మూసుకున్నా నేను!

Wednesday, June 22, 2011

"మిడిల్ క్లాస్ మహాభారత్"

"మిడిల్ క్లాస్ మహాభారత్"
______________________________________

రాత్రి పదైతే చాలు..,
తండ్రి ధృతరాష్ట్రుడు, తల్లి గాంధారి.
ఇక ఈడొచ్చిన తమ్ముడు-
నిదరోయే విదురుడు.

శరీరాలు సైలెన్సర్ బిగించిన
మరపిరంగులు.

ముత్తాతల కాలంనాటి-
మూలిగే మూగ మంచం మీద ఆమె,
ఆమ్మీద నేను.

నా కింద అణిచిపెట్టుకున్న-
తన ఎక్స్టసీ, ప్రతి రాత్రీ
ఫోక్రాన్ ఇసుక లోతుల్లో-
నిశ్శబ్దంగా విస్పోటనమయ్యే-
అణుప్రయోగం.

ఇరుకింట్లో మేం ఐదుగురం
అజ్ఞాతంలో పాండవులం.
( 23 జనవరి, 20005 ఆదివారం ఆంధ్రజ్యోతి)

Tuesday, June 21, 2011

"భారతీయం"



ఓసారి
దేవతలంతా అనుకున్నారు-
... మనుషులుగా పుట్టాలని.

మరి
రాక్షసులు వూరుకుంటారా??
వెంటనే పుట్టేసారు-
రాజకీయ నాయకులుగా!!!