Monday, August 16, 2021

LINK TELUGU: సింపుల్ ఒన్ ఎలక్ట్రిక్ స్కూటెర్

LINK TELUGU: సింపుల్ ఒన్ ఎలక్ట్రిక్ స్కూటెర్:  పెరుగుతున్న పెట్రోల్ ధరలను ద్రృష్టిలో పెట్టుకోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించాలనే స్ప్రుహ కూడా ప్రజలలో కలుగుతూ వుండటంతో తయా...

Friday, December 9, 2011

ఆ రాత్రి

దేహచ్చాయల మీద ఆరేసుకున్న
వెన్నెల క్రీనీడలు.
నఖక్షతాల్తో
చంద్రుడు,నక్షత్రాలు.

విస్తరించిన నిమిషానందపు
బోన్సాయ్ వృక్ష సమూహం.
పరిమళ నిశ్వాసం పరుచుకున్న
పట్టెమంచం.

మేని సానువుల్లో
అధరాలు తచ్చాడిన
తడి జ్ఞాపకాలు.

ఎనిమిది కాళ్ళతో
చలించిన అక్టోపసి.
సుషుప్తి గవాక్షాల్లో రెక్కలిప్పుకుని,
సుదూరమైన స్వప్న విహంగం.

ఆర్తి అంతఃస్రావమైన అలక్ నందా.

ఆ రాత్రి
చీకటి గూట్లోకి
నత్తల్లా ఒదిగిపోయాం
మేమిద్దరం.

Sunday, October 16, 2011

అచ్చం అలాగే



కొత్త చీరొకటి
ఒంటిపై చుట్టుకోడానికి
గదిలోకి దూరింది.,


గొంగళి పురుగుకి సిగ్గెక్కువ
మా ఆవిడకు లాగే.!

Monday, September 26, 2011

వాంఛ




పక్కింటి స్నానాల గదిలోకి
తొంగి చూస్తూ-
మా చెట్టు కొమ్మ!

నా తీరని వాంఛకు
బహుశా అది
ప్రతిరూపమేమో?

Thursday, September 8, 2011

కుటీరం




తూర్పు,పడమర గోడలకు-
రెండు కిటికీలతో,
మాకొక
పన్నెండడుగుల గది మాత్రమే వుంది.

ఐతే ఏం?

ఆ కిటికీ దాటి,
ఈ కిటికీలో కనిపించడానికి,
సూర్యుడికి-
పన్నెండు గంటలు పడ్తుంది.