Monday, July 18, 2011

'సిక్స్త్ చాంబర్'




    



'సిక్స్త్ చాంబర్'
___________________


మా ఇంట్లోనూ
ఓ పద్మనాభుడి ఆలయం వుంది!

పంచేంద్రియాలతో పోగుచేసుకున్న
పాత జ్ఞాపకాల్ని-
కాలం ఇంకా లెక్క కడ్తూనే వుంది.

స్కూలు ఫీజు, పాల బిల్లు, ఇంటి అద్దె-
ఆంక్షల గోపురంపై నిలబడి,
ఓ కోడిపుంజు కూస్తూనే వుంటుంది.

తరతరాల దాస్య చేధనలో
లెక్క తేలనంత తారతమ్యం
తారాడుతూనే వుంది.

నా ఒంట్లోనూ
నేలమాళిగ వుంది
ఆశల్ని రాసులుగా పేర్చుకుని,
శతాబ్దాలుగా నిరీక్షిస్తోంది.

మూరెడు మల్లెపూలతో మురిపించే
దేహ సౌందర్యం మెరుస్తూనే వుంటుంది.
తలపుల తటాకాల్లో తెల్ల వెంట్రుక-
వెండి తీగలా అల్లుకు పోతోంది.

చూస్తుండగానే చుట్టూ పోగై పోతున్న
వాంఛల హర్మ్యాల క్రింద వర్తమానం-
ఒంటరి ఎత్తులు వేస్తూనే వుంది.

త్రవ్వుతూ వెళ్లేకొద్దీ-
దొరికే గతం నిండా,
బాల్యం బంగారుకొండల్లే నిలబడే వుంటుంది.

అరలకొద్దీ పేరుకు పోయిన
అనుభవాల దొంతరల్లో-
ఎప్పటికో గానీ ఓ నవ్వు
నీలి వజ్రమై వెలిగి పోతుంది.

దొరకని దానికోసం ఇప్పటికీ
జీవితం వెతుకుతూనే వుంటుంది.
ఇనుప గొలుసులతో లాగే బంగారు రధం-
ఎప్పటికీ వెనుకే వుంటుంది.

నా ఒంట్లోనూ
ఓ పద్మనాభుడి ఆలయం వుంది.

ఇంకా తెరుచుకోని ఆరో గదిలో-
మృత్యువు కాచుకు కూర్చుని వుంది.


                                    

Monday, July 4, 2011

‎'కొన్ని సందర్భాలు'


ఓ నెలబాలుడి హఠాన్మరణం-
ఇంకా నా గుండె గదిలో
దోగాడ్డం నేర్చుకుంటూనే వున్నాడు.

ఓ మిత్రుడు పోతూ..పోతూ
తన చేతి స్పర్శని
జ్ఞాపకంగా మిగిల్చి పోయాడు.

ఓ ప్రత్యూషం, నీడ ని
లాక్కెళ్ళి పోతుంది.
అప్పుడు అమ్మ లాగే-
చెట్టూ విధవ.

ఓ వృద్దుని ఆలింగనంలో
నా ముందు తరాల
ప్రేమ పరిమళం.

వెళ్తూ వెళ్తూ ఎక్కడో
బాల్యాన్ని పోగొట్టుకున్నాను.
ఎప్పటికో వెతికాక,
వణికే చేతికి ఓ
ఊతకర్ర దొరికింది.