Monday, August 8, 2011

'సుప్రభాతాలు'


       
          
  కాకులన్నీ వాలాక,
  నల్ల కలువల్ని పూసిన-
  తటాకమౌతుంది చెట్టు.


  ఆకాశాన్ని కాళ్ళ క్రిందికి
  తెచ్చుకుంటుంది గబ్బిలాయి.
  చుక్కల్ని ముగ్గులోకి
  దింపుతుంది ఓ ఆకతాయి.


  పెదాల పలకల మీద
  ఓంకారాన్ని దిద్దుకుంటూ
  ఓ 'పిల్ల'నగ్రోవి.

  గుడి కోనేట్లో నిలువీత-
  నేర్చుకుంటాయి  తామర పూలు.
  చెరువు నీట్లో ముఖాలు చూసుకుని,
  మురిసిపోతుంటాయి మేఘాలు కొన్ని.

  పాల కోసం, 
  తల్లి చుట్టూ
  పొద్దుతిరుగుడు పువ్వై పోతుంది
  లేగ దూడ.

  అమ్మచేతి తేనీరు కోసం
  నా పెదాలు తేనెటీగలవుతాయి.

  అప్పుడేమో అట్లాస్-
  భుజం మీది భూమిని మెల్లగా క్రిందికి దించి,
  పుస్తకాల సంచితో-
  బడికి భయల్దేరుతాడు.

   
                       ________________
                               

No comments:

Post a Comment