Friday, June 24, 2011

సమాంతర రేఖలు



కూలిపోతున్న స్వప్నాల అంచులకి-
ఏ కళ్ళూ వేళ్ళాడవు.
శిధిలమవుతూన్న స్వగతాల్లో-
ఏ పావురాళ్ళూ గూళ్ళు కట్టుకోవు.

చీకట్లో పెదాల రంగు నలుపు.,
స్పర్శ ఓ గాఢమైన భావన.

నలిగిన పూల కోసం
ఏ చూపులూ తచ్చాడవు.
మార్మిక క్షణాలను లెక్కించే-చేతివేళ్ళలో నిర్లిప్తత.

మేఘం మృతసంగీతాన్ని మోసుకొస్తుంది.,
కాలం తలొంచుకు పనిచేసే బానిసలా వుంటుంది.

వేల వేల నీడలుగా-చెదిరిపోయే దీపాన్ని,
ఏ పాదాలూ అనుసరించవు.

కుంచె గీసే కల అస్పష్ట చిత్రం.
ముక్కలైన భావాన్ని-
ఏ గొంతూ దాచుకోదు.

చిట్లిన పెదాలు పాటనే స్రవిస్తాయి.,
భాద ఒక శ్రోత.

ముసిరే చీకటి తెరలని-
ఏ పొద్దూ అడ్డుకోదు.
చుట్టూ పెరిగే గోడల్ని-
ఎవరూ సమాధిగా ఒప్పుకోరు.

జీవితం ఆద్యాంతాలూ లేని-
గాన స్రవంతి.
శృతి చెదిరిన సంగీతం వెనుక-
ఏ గుండె గతి మరువదు

No comments:

Post a Comment